🅿️తొలి తెలుగు యాంకర్ శాంతి స్వరూప్‌ కన్నుమూత

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం శాంతి స్వరూప్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను నగరంలోని యశోదా ఆస్పత్రిలో చేరారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. తెలుగులో తొలిసారి వార్తలు చదివిన శాంతి స్వరూప్‌.. వార్తా రంగంలో చెరగని ముద్రవేశారు. 10 ఏళ్ల పాటు టెలీప్రాంప్టర్‌ లేకుండా పేపర్‌ చూసి చెప్పేవారు. 1983 నవంబర్‌ 14 నుంచి దూరదర్శన్‌లో వార్తలు చదవడం ప్రారంభించారు. 2011లో దూరదర్శన్‌లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు.

తొలి తరం న్యూస్ రీడర్‌గా తెలుగు ప్రజలు అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్‌ మరణం బాధాకరమని ముఖ్యమంత్రి రేవంత్‌ అనుముల ఒక సందేశంలో పేర్కొన్నారు. 1983 నుంచి న్యూస్‌ రీడర్‌గా శాంతి స్వరూప్‌ తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్ ద్వారా ఆయన అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం రేవంత్‌ ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.