🅿️వాతావరణశాఖ గుడ్‌న్యూస్‌.. ఈ జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు..!

తెలంగాణలో రాగల మూడురోజుల పాటు పలు జిల్లాలో వడగాలులు, పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాల్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సోమవారం వనపర్తి, జోగులాంబ గద్వాలలో వడగాలులు వీస్తాయని.. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగితాల్య, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. మంగళవారం పలుచోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని చెప్పింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలతో పాటు ములుగు, భూపాలపల్లి, మెదక్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Leave a Comment