🅿️బంగ్లాదేశ్‌లో ఊపందుకున్న భారత్‌ బాయ్‌కాట్‌

2024 జనవరిలో జరిగిన ఎన్నికల్లో షేక్‌ హసీనా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ బంగ్లాదేశ్‌లో ఐదోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రధానిగా షేక్‌ హసీనా మరోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్‌ మీడియా వేదికగా మొదలైన ఈ ప్రచారం మరింత ఊపందుకున్నది. ఇప్పుడు ఆ స్లోగన్‌ ఒక ఉద్యమంగా మారింది. బంగ్లాదేశ్‌ అంతర్గత వ్యవహారాల్లో భారత్‌ జోక్యం చేసుకుంటున్నదని, తమ సొంత ప్రయోజనాల కోసమే షేక్‌ హసీనాను మళ్లీ ప్రధానిగా చేశారంటూ ఐరోపా, అమెరికాలో ఉంటున్న ప్రవాస బంగ్లాదేశీయులు ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారు. బంగ్లాదేశ్‌ ఉనికికి కారణం భారతదేశం. వారి ఆశలకు, ఆకాంక్షలకు తగ్గట్టు బంగ్లాదేశ్‌ను ఏర్పాటుచేసిన భారత్‌ అంటే.. ఆ దేశీయుల్లో ప్రత్యేకమైన అభిమానం ఉన్నదన్న సంగతి అందరికీ తెలిసిందే. భారత్‌తో కలిసి ఎక్కువ భూ సరిహద్దులు కలిగి ఉన్న ఈ దేశం వాణిజ్య అవసరాల కోసం భారత్‌పైనే ఆధారపడుతున్నది. అంతేకాదు.., భారత్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన దేశంగా పేరున్నది. అలాంటి దేశంలో ఇప్పుడు కొత్తగా ‘బాయ్‌కాట్‌ భారత్‌’ అన్న నినాదం ప్రారంభం కావడమే కాదు, అంతకంతకూ విస్తరిస్తున్నది. దీనికి కారణమేమిటి? దీని వెనుక ఉన్నదెవరు? ఇప్పుడే ఈ వ్యవహారం తెరమీదికి రావడానికి కారణాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలను పరిశీలి స్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి.

సోషల్‌ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ దుష్ప్రచారానికి మద్దతుగా భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులను కొనవద్దని, వాడవద్దని బంగ్లాదేశ్‌ ప్రజలను ప్రచారకులు కోరుతున్నారు. ప్రస్తుతం పారిస్‌లో ఉంటున్న బంగ్లాదేశీ వైద్యుడు పినాకీ భట్టాచార్య ఈ ఆన్‌లైన్‌ ఉద్యమానికి తెర తీసినట్టుగా తెలుస్తున్నది. ప్రవాసీ బంగ్లాదేశీయుల పిలుపుతో బంగ్లాలోని కొన్ని వర్గాలు ఈ నినాదానికి తమ మద్దతు తెలియజేయడంతో అక్కడి ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ (బీఎన్‌పీ) దీన్ని రాజకీయాస్త్రంగా మార్చుకున్నది.
‘బాయ్‌కాట్‌ భారత్‌’ నినాదాన్ని అందిపుచ్చుకొని ప్రధాని షేక్‌ హసీనా భారత్‌ అవసరాల కోసమే పనిచేస్తున్నట్టుగా ప్రచారాన్ని షురూ చేశారు. తమ వాదనకు బలం చేకూరేలా వారు కొన్ని వాదనలను వినిపిస్తున్నారు. అందులో ముఖ్యమైనది తాజాగా ముగిసిన బంగ్లాదేశ్‌ పార్లమెంటు ఎన్నికలు. ఇవి అత్యంత వివాదాస్పదమైనవిగా ముద్రపడ్డాయి. ఎన్నికలను ప్రతిపక్షాలు బహిష్కరించడంతో హసీనా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ఆమె విజయం సాధించారన్న వార్తలు వచ్చిన వెంటనే.. భారత ప్రధాని మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలుపటం, మద్దతును ప్రకటించడమే దీనికి నిదర్శనంగా పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌లో ‘బాయ్‌కాట్‌ భారత్‌’ ఉద్యమం అక్కడి ప్రజల్లో కాకుండా రాజకీయ ఎజెండాతోనే ప్రారంభమైనట్టుగా పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ వ్యవహారం ట్రెండింగ్‌లో కొనసాగడమే తప్ప వాస్తవంగా ఈ అంశానికి బంగ్లా ప్రజల నుంచి ఎటువంటి మద్దతు లేదని కొందరు చెప్తున్నారు. ‘బాయ్‌కాట్‌ భారత్‌’ ఉద్యమంపై ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులను ‘బాయ్‌కాట్‌ చేయాలంటే ప్రతిపక్ష బీఎన్‌పీ నేతలు ముందు తమ భార్యల చీరలన్నింటినీ కాల్చేయాలి’ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతల భార్యలు భారత్‌కు వెళ్లి భారీ సంఖ్యలో చీరలు కొనుగోలు చేయడం, వాటిని బంగ్లాదేశ్‌లో విక్రయించడాన్ని తాను చూశానని చెప్పిన ప్రధాని షేక్‌ హసీనా వాటన్నింటినీ మీరు కాల్చేస్తారా? ‘భారత్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న మసాలాలు.. ఉల్లిపాయలు.. అల్లం.. వెల్లుల్లి లాంటివి లేకుండా విపక్ష నేతలు.. వారి కుటుంబాలు తమ వంటలను తయారుచేసుకొని తినాలి’ అని చురకలంటించారు. అయితే, ఇక్కడే మరో అంశాన్ని మనం ప్రస్తావించాలి. మాల్దీవుల్లోనూ భారత వ్యతిరేక నినాదంతోనే మహ్మద్‌ మాయిజ్జు అక్కడ అధికారంలోకి వచ్చారు. తాజాగా బంగ్లాదేశ్‌లోనూ ఇదేతరహా వ్యూహాన్ని కొంతమంది భారత వ్యతిరేకశక్తులు అమలు చేయడానికి సిద్ధమైనట్టు స్పష్టంగా తెలుస్తున్నది. ఇదిలా ఉంటే రంజాన్‌ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు 50 వేల టన్నుల ఉల్లిగడ్డలను పంపాలని భారత్‌ నిర్ణయించడం గమనార్హం.

Leave a Comment