🅿️పొద్దున్నే బ్రష్‌ చేసుకోకపోతే పెద్దపేగు క్యాన్సర్‌!

న్యూయార్క్‌: ఉదయాన్నే పళ్లు తోముకోకపోతే దుర్వాసనతో పాటు నోటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెప్తుంటారు. అయితే, ఇప్పుడు అమెరికాకు చెందిన పరిశోధకులు మరో కీలక విషయాన్ని వెల్లడించారు. ఉదయాన్నే బ్రష్‌ సరిగ్గా చేసుకోకపోతే పెద్దపేగు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫ్రెడ్‌ హట్చిన్‌సన్‌ క్యాన్సర్‌ కేంద్రానికి చెందిన పరిశోధకులు 200 మంది పెద్ద పేగు క్యాన్సర్‌ బాధితులపై జరిపిన అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

ఇలా తెలిసింది

పెద్ద పేగు క్యాన్సర్‌ బాధితుల్లో ఉన్న సగం కణతుల్లో దంతాల్లో ఉండే సూక్ష్మజీవులు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. నోటిలో ఉండే సూక్ష్మజీవులు కడుపులోని కింది పేగుల వరకు ప్రయాణం చేయగలవని, పేగు లోపలి పొరలో క్యాన్సర్‌కు ఇవి కారణమవుతాయని నిర్ధారణకు వచ్చారు. పేగుల్లో ఉన్నట్టుగానే నోటిలో కూడా వివిధ రకాల బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌లు ఉంటాయని, దాదాపు 700 రకాల సూక్ష్మజీవులు నోటిలో ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ప్రతిరోజూ సరిగ్గా బ్రష్‌ చేసుకోకపోతే ఇవి పెద్ద పేగుకు చేరుకొని క్యాన్సర్‌కు కారణమవుతాయని పేర్కొన్నారు.
యువతలోనూ పెరుగుతున్న ముప్పు
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్‌లలో ఇది రెండోది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 19 లక్షల మంది పెద్దపేగు క్యాన్సర్‌ బారిన పడగా, 9,30,000 మంది మరణించారని లెక్కలు చెప్తున్నాయి. ముఖ్యంగా 50 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో ఈ క్యాన్సర్‌ అభివృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది. అయితే, గత 15 ఏండ్లుగా 20 – 49 ఏండ్ల వయస్సు వారు కూడా పెద్దపేగు క్యాన్సర్‌ బారిన పడటం ఏడాదికి 1.5 శాతం చొప్పున పెరుగుతున్నది.

Leave a Comment