🅿️బీజేపీని నిలువరించే అవకాశాలను ప్రతిపక్షం కోల్పోయింది.. అన్ని క్యాచ్‌లను వదిలేస్తోంది: ప్రశాంత్ కిషోర్

పాట్నా: ఎన్నికల్లో బీజేపీని నిలువరించే అన్ని అవకాశాలను ప్రతిపక్షం కోల్పోయిందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. క్రికెట్‌ మ్యాచ్‌లో ఫీల్డర్‌ క్యాచ్‌లను వదలడం వంటిదని విమర్శించారు. ‘మీరు క్యాచ్‌లు వదిలేస్తూ ఉంటే, బ్యాటర్ సెంచరీ సాధిస్తాడు’ అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ చేస్తున్న ‘నిలువరించలేని మార్చ్‌’ అన్నది కేవలం ఊహా, పెద్ద భ్రమ అని ఎద్దేవా చేశారు. తాము అజేయులమని బీజేపీ, ప్రధాని మోదీ డామినేషన్‌ ప్రదర్శిస్తున్నారని అన్నారు. 2015, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో తప్ప పలు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిందని గుర్తు చేశారు. అయితే బీజేపీ తిరిగి పుంజుకునేలా ప్రతిపక్షం వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.

కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ‘ఇండియా’ బ్లాక్‌ ఓడిపోతుందని, కేవలం వంద సీట్లకే పరిమితమవుతుందని ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. అలాగే బీజేపీ చెబుతున్నట్లుగా 370 సీట్లలో ఆ పార్టీ గెలువలేదని తెలిపారు. సుమారు 300 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పారు. అయితే ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లో ఆ పార్టీ రాణిస్తుందని అన్నారు.

Leave a Comment