🅿️వివాదంలో తెలంగాణ మంత్రి పొంగులేటి కుమారుడు

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడు హర్షా రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. కొన్ని కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక గడియారాల స్మగ్లింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు పొంగులేటి హర్ష రెడ్డికి చెన్నై కస్టమ్స్ సమన్లు ​​జారీ చేసింది. హైదరాబాద్‌లోని హర్షారెడ్డి డైరెక్టర్‌గా ఉన్న కుటుంబ యాజమాన్య సంస్థ కార్యాలయానికి మార్చి 28నే అధికారులు సమన్లు ​​పంపారు. అయితే.. ఆ నోటీసుల్లో ఏప్రిల్ 4న విచారణకు హాజరుకావాలని కస్టమ్స్‌ అధికారులు పేర్కొన్నారు. నోటీసులకు స్పందించిన హర్ష రెడ్డి తాను ఏప్రిల్‌ 27 తర్వాతే విచారణకు వస్తానని రిప్లై ఇచ్చారు. ఈ మేరకు ఏప్రిల్ 3వ తేదీన రాసిన లేఖలో తాను డెంగ్యూ జ్వరం నుంచి బాధపడుతున్నట్లు చెప్పాడు. దాని కోలుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అందుకే విచారణకు ఇప్పుడు హాజరుకాలేనని పేర్కొన్నాడు. వైద్యల సలహా మేరకు ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానని హర్ష రెడ్డి చెప్పాడని కస్టమ్స్‌ అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

పొంగులేటి కుమారుడు హర్ష పటెక్‌ ఫిలిప్‌, బ్రిగెట్‌ బ్రాండ్‌లకు చెందిన రెండు లగ్జరీ వాచ్‌లను ఇటీవల ఆర్డర్ చేశాడని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. భారత్‌లో దొరకని ఈ బ్రాండ్‌లు తెప్పించుకునేందుకు నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తి సహాయంతో ముబిన్‌ అనే స్మగ్లర్‌ను ఆశ్రయించాడని పేర్కొన్నారు. హర్ష కోసం ముబిన్‌ ఆ రెండు వాచ్‌లను సింగపూర్‌ నుంచి తెప్పించాడని కస్టమ్స్ తెలిపింది. ఈ వాచ్‌ల విలువ ఒక్కోటి రూ.1.75 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ వాచ్‌ల కోసం డబ్బులను హవాలా రూపంలో చెల్లించినట్లు సమాచారం. దీనిపైనే కేసు నమోదు చేసిన చెన్నై కస్టమ్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే నవీన్‌ కుమార్‌ను కూడా విచారించారు. తాజాగా హర్ష రెడ్డిని విచారించేందుకు నోటీసులు ఇచ్చారు.

Leave a Comment