సెలవులు పొందడం అనేది ఉద్యోగులకు ఒక హక్కు అనే విషయం తెలిసిందే. సిక్ లీవ్ మొదలు రకరకాల కారణాలకు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులను ఇస్తుంటాయి. అయితే ఓ కంపెనీ మాత్రం అస్సలు ఎవరూ ఊహించని కారణానికి కూడా సెలవులు ఇస్తోంది. ఇంతకీ ఆ కంపెనీ సెలవులు ఎందుకు ఇస్తుందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
సాధారణంగా మనకు తెలిసిన లీవ్స్లో సిక్స్ లీవ్స్, క్యాజువల్ లీవ్స్, ప్రసూతి లీవ్స్ వంటివి ఉంటాయి. అయితే ప్రేమ విఫలమైతే కూడా సెలవులు ఇస్తారని మీకు తెలుసా.? అవును ఇండియాకు చెందిన స్టాక్ గ్రో అనే ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ తమ ఉద్యోగులకు ఇలాంటి వెరైటీ సెలవులను అందిస్తోంది. బ్రేక్ప్ లీవ్స్ పేరుతో ఈ సెలవులను అందిస్తున్నారు. స్టాక్ గ్రో తమ ఉద్యోగులకు బ్రేకప్ కష్టకాలంలో మద్ధతుగా నిలిచేందుకు ఈ సెలవు విధానాన్ని ప్రవేశపెట్టింది.
రిలేషన్ షిప్ నుంచి విడిపోయిన తర్వాత క్లిష్ట సమయాల్లో బ్రేక్ అప్ లీవ్ పాలసీ ఉద్యోగులకు ఉపశమనం కలిగిస్తుందని కంపెనీ చెబుతోంది. తమ ఉద్యోగుల గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, వారి బాధను అర్థం చేసుకున్నామని, ఈ లీవ్ పాలసీ ద్వారా కష్టకాలంలో వారికి అండగా నిలిచేందుకు ఈ లీవ్స్ ప్రవేశ పెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఈ విధానం ప్రకారం స్టాక్ గ్రో ఉద్యోగులు ఒక వారం సెలవు తీసుకోవచ్చు.
ఉద్యోగులు బ్రేకప్ కారణం పేరుతో సెలవులు తీసుకున్నా కంపెనీ ఎలాంటి ప్రశ్నలు అడగదు, ఎలాంటి రుజువు అడగదు. ఉద్యోగి ఈ సెలవులు కోరుకుంటే, నేరుగా యాజమాన్యంతో మాట్లాడి సెలవును తీసుకోవచ్చు. ఈ సెలవు బ్రేకప్ అయిన ఉద్యోగికి మనశ్శాంతిని ఇస్తుందని, తిరిగి వచ్చి మెరుగైన పని చేయగలుగుతాడని కంపెనీ చెబుతోంది. ఏది ఏమైనా ఈ కంపెనీ అందిస్తోన్న ఈ లీవ్ పాలసీ భలే విచిత్రంగా ఉంది కదూ!