🅿️కడియం టికెట్‌పై పీటముడి!.. శ్రీహరి అభ్యర్థి అయితేనే టికెట్‌ అంటూ కాంగ్రెస్‌ మెలిక?

బీఆర్‌ఎస్‌ నుంచి ఫిరాయించిన స్టేషన్‌ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కాంగ్రెస్‌ పార్టీ బిగ్‌షాక్‌ ఇచ్చినట్టేనని ఆ పారీవర్గాల తాజా సమాచారం. తన కూతురు కావ్యకు వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఆశించి కడియం శ్రీహరి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, కావ్యకు కాకుండా శ్రీహరి అభ్యర్థి అయితేనే టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ అధిష్ఠానం తాజాగా మెలిక పెట్టినట్టు తెలిసింది. అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి ఉంటుందనే షరతు పెట్టినట్టు కాంగ్రెస్‌ ఢిల్లీ వర్గాల తాజా సమాచారం. ఒకవేళ కడియం శ్రీహరి అందుకు అంగీకరించని పక్షంలో వరంగల్‌ సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ లేక దొమ్మాటి సాంబయ్య పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

కాంగ్రెస్‌ పెట్టిన కండిషన్‌కు కడియం శ్రీహరి అంగీకరిస్తే, అప్పుడు నాగర్‌కర్నూల్‌ అభ్యర్థిగా ప్రకటించిన డాక్టర్‌ మల్లు రవిని మార్చి అక్కడ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నంది శ్రీహరికి (దివంగత మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కుమారుడు) టికెట్‌ ఇవ్వాలని అధిష్ఠానం తాజాగా పునరాలోచనలో పడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పీటముడి కారణంగానే ఢిల్లీలో ఆదివారం జరిగిన కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ భేటీలో తెలంగాణ అభ్యర్థుల ఎంపికను సోమవారానికి వాయిదా వేసినట్టు సమాచారం. ఈ పరిణామాల వల్లనే ఆదివారం ఢిల్లీ వెళ్లాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోనే ఉండిపోయినట్టు తెలిసింది. కాగా కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, హైదరాబాద్‌.. ఈ నాలుగు స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉన్నది.

వరంగల్‌, కరీంనగర్‌ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాకపోవడంతో సీఈసీ సోమవారం తిరిగి సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాంగ్రెస్‌లో మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్న వాదనతో పార్టీ అధిష్ఠానం పునరాలోచనలో పడినట్టు తెలిసింది. తెలంగాణలో ఎస్సీలకు మూడు ఎంపీ స్థానాలు రిజర్వు కాగా, ఇందులో ఇప్పటికే నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవి, గడ్డం వంశీని అభ్యర్థులుగా ప్రకటించింది. మిగిలిన వరంగల్‌ స్థానం నుంచి కూడా అదే మాల సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తే, మాదిగ ఓటర్లను దూరం చేసుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్‌ అధిష్ఠానం జంకుతున్నట్టు తెలిసింది. దీనివల్ల కడియం శ్రీహరి అభ్యర్థి అయ్యే పక్షంలో నాగర్‌కర్నూల్‌లో మల్లు రవికి బదులుగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నంది శ్రీహరికి టికెట్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ పెద్దలు యోచిస్తున్నట్టు తెలిసింది. గతంలో ఆయన తండ్రి, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు.

ఖమ్మం నుంచి రఘురామిరెడ్డి ఖరారు?

కాంగ్రెస్‌ పెద్దలకు తలనొప్పిగా మారిన ఖమ్మం అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ‘పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చింది’ అన్న చందంగా ఖమ్మం టికెట్‌ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి నందిని కోసం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన సోదరుడు ప్రసాద్‌రెడ్డి కోసం పట్టుబట్టడంతో వీరిద్దరికీ కాకుండా మూడో వ్యక్తిగా రఘురామిరెడ్డిని ఎంపిక చేసినట్టు తెలిసింది. దాదాఫు ఈయన అభ్యర్థిత్వం ఖరారు అయినట్టేనని ఢిల్లీ కాంగ్రెస్‌ వర్గాల సమాచారం. రఘురామిరెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడు కావడం కూడా కలిసొచ్చినట్టు తెలిసింది.

రఘురామిరెడ్డి ఎంపికలో మరో రెండు ట్విస్టులు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి స్వయానా వియ్యంకుడు కావడం ఒకటైతే, రెండోది రఘురామిరెడ్డి కుమారుడికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన హీరో వెంకటేశ్‌ కూతురును ఇచ్చారు. దీంతో ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా పొందవచ్చని కాంగ్రెస్‌ వ్యూహంగా చెప్తున్నారు. ఖమ్మం నుంచి పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎన్టీఆర్‌ మనవరాలు, హరికృష్ణ కూతురు సుహాసిని పేరు కూడా పరిశీలనకు వచ్చినట్టు తెలిసింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడు కావడంతో ఆయన సోదరి సుహాసిని పేరును పరిశీలనకు చివరి నిమిషంలో ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదని తెలిసింది.