🅿️పీహెచ్‌డీ ప్రవేశాలు యూజీసీ చేతుల్లోకి!

రాష్ట్రంలోని వర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు యూజీసీ చేతుల్లోకెళ్లనున్నాయా? ఇక నుంచి వర్సిటీల వారీగా ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షలుండవా ? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటీవలే పీహెచ్‌డీ అడ్మిషన్లపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కీలక ప్రకటన చేసింది. 2024 -25 విద్యాసంవత్సరం నుంచి పీహెచ్‌డీ కోర్సుల్లో యూజీసీ నెట్‌ స్కోర్‌ ద్వారా ప్రవేశాలు కల్పించాలని అన్ని వర్సిటీలకు లేఖలు రాసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం మూడు క్యాటగిరీల్లో పీహెచ్‌డీ అడ్మిషన్లు కల్పిస్తారు. క్యాటగిరీ -1లో జేఆర్‌ఎఫ్‌ ఉన్న వారికి పీహెచ్‌డీ అడ్మిషన్‌ కల్పించడంతో పాటు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా నియమించే అవకాశం ఉన్నది. ఇలాంటి వారిని వర్సిటీలు కేవలం ఇంటర్వ్యూల ఆధారంగా అడ్మిషన్లు జారీచేస్తాయి.

ఇక క్యాటగిరీ -2లో జేఆర్‌ఎఫ్‌ లేకుండా పీహెచ్‌డీలో అడ్మిషన్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా అవకాశం కల్పిస్తారు. క్యాటగిరీ -3 కేవలం పీహెచ్‌డీ కోర్సుల్లో మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. క్యాటగిరీ -2, 3 అడ్మిషన్లకు 70 శాతం మార్కుల వెయిటేజీ, ఇంటర్వ్యూకు 30 శాతం మార్కుల వెయిటేజీ ఉంటుంది. ప్రస్తుతం జారీచేసే నెట్‌ స్కోర్‌ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే మహత్మాగాంధీ, పాలమూరు వర్సిటీలు యూజీసీ – నెట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. తాజాగా యూజీసీ ప్రకటన నేపథ్యంలో ఓయూ, కేయూలు ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోవాలా? లేదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

నెట్‌తో ఏ వర్సిటీకైనా పోటీపడొచ్చు

నెట్‌ ద్వారా విద్యార్థులు దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. వర్సిటీలు నిర్వహించే అనేక ప్రవేశ పరీక్షలను రాయాల్సిన అవసరం లేదు. అన్ని వర్సిటీలు పీహెచ్‌డీ ప్రవేశాలకు నెట్‌ స్కోర్‌ను ఉపయోగించేందుకు మార్గదర్శకాలు జారీచేశాం.
– ప్రొఫెసర్‌ మామిడాల జగదీశ్‌కుమార్‌, యూజీసీ చైర్మన్‌