🅿️మాదిగల-’ చుట్టూ ఓటు రాజకీయం

లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ సీటు విషయంలో మాదిగల చుట్టూ రాజకీయం సాగుతున్నది. తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ సామాజికవర్గంలో 70% వరకు ఉన్న మాదిగల ఓట్లు పొందేందుకు బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తెచ్చే ప్రచారాన్ని చేపట్టాయి. మాదిగల్లో సెంటిమెంట్ పెంచి కాంగ్రెస్ సానుకూల ఓటు బ్యాంకును తమ వైపు మళ్ళించుకునేందుకు రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్‌లోని మాదిగ సామాజిక వర్గం సైతం తమకు అన్యాయం జరుగుతోందని, తగిన ప్రాధాన్యం ఇవ్వాలని మొదటి నుంచి కోరుతున్నది. పార్టీ అధిష్ఠానానికి విన్నపాలు చేస్తూ, వివిధ పద్ధతుల్లో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అదనుగా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అడుగు ముందుకేసి కాంగ్రెస్, బీఆర్ఎస్‌ మాదిగలకు అన్యాయం చేశాయంటూ విమర్శిస్తున్నారు. తెలంగాణలోని మూడు ఎస్సీ రిజర్వుడు ఎంపీ స్థానాలైన నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ స్థానాలు లక్ష్యంగా ఈ డిమాండ్ ప్రారంభం కాగా, తాజాగా వరంగల్ స్థానం కేంద్రంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా కడియం శ్రీహరి కాంగ్రెస్ చేరడంతో ఆ కుటుంబానికి కాంగ్రెస్ టికెట్ లభిస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో ‘మాదిగల’ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకున్నది.

రాష్ట్రంలో నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ మూడు ఎంపీ స్థానాలు ఎస్సీ రిజర్వుడు స్థానాలుగా ఉన్నాయి.

ఈ మూడు స్థానాలకు బీజేపీ ముగ్గురిని, బీఆర్ఎస్ ముగ్గురిని ప్రకటించినా పరిస్థితి మారి ఒక స్థానానికి అభ్యర్థిని తాజాగా ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ రెండు స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకోటి ప్రకటించాల్సి ఉంది. బీజేపీ పోటీ అభ్యర్థులు మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో బీజేపీ ఇద్దరు మాదిగలకు, మాల ఉపకులమైన ఒక నేతకానికి టికెట్ ఇచ్చింది. బీజేపీ నాగర్ కర్నూల్ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన పోతుగంటి భరత్‌ను ఎంపిక చేసింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు బీఆర్ఎస్ నుంచి తన కుమారుడు భరత్‌తో కలిసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పెద్దపల్లి అభ్యర్థిగా నేతకాని కులానికి చెందిన గోమాస శ్రీనివాస్‌కు అవకాశం ఇచ్చారు. శ్రీనివాస్ గతంలో బీఆర్ఎస్ నుంచి పోటీచేశారు. తాజాగా బీజేపీలో చేరారు. వరంగల్ నుంచి మాదిగ సామాజికవర్గానికి చెందిన అరూరి రమేశ్‌ను అభ్యర్థిగా నిర్ణయించింది. రమేశ్‌ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు.

ఒక మాదిగ, ఒక మాల, ఒక బైండ్ల వర్గాలకు బీఆరెస్‌ టికెట్లు

బీఆర్ఎస్ అభ్యర్థులుగా మూడు స్థానాలకుగానూ ఒకరు మాదిగ, ఒకరు మాల, మరొకరు మాదిగ ఉపకులమైన బైండ్ల సామాజికవర్గం నుంచి ఎంపిక చేశారు. బైండ్ల సామాజికవర్గానికి చెందిన కడియం కావ్య పార్టీని వీడారు. బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను ఎంపిక చేసింది. బీఎస్పీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన ఈ మాజీ ఐపీఎస్‌కు బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. పెద్దపల్లి నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ టికెట్‌ పొందారు. వరంగల్ నుంచి బైండ్ల సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను ఎంపిక చేసింది.

కడియం కుటుంబం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటారని స్పష్టం కావడంతో ఇక్కడ కూడా వారిని మాదిగ వ్యతిరేకులుగా అభివర్ణించారు. కడియం మాదిగ వ్యతిరేకి అంటూ బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ విమర్శిస్తున్నారు. మాదిగలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని ఆ పార్టీ నేత రసమై బాలకిషన్ తదితరులు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ బీజేపీకి బహిరంగంగా మద్ధతు తెలపడం పట్ల కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కడియానికి కృష్ణ మాదిగ బహిరంగ మద్దతు తెలిపి, తమ సామాజికవర్గానికి ప్రతినిధిగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూ ఎన్నికల్లో బీజేపీకి పావుగా మారారని విమర్శిస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా ఎన్నికలప్పుడు హామీలిస్తే కృష్ణమాదిగ వత్తాసు పలుకుతున్నారని మండిపడుతున్నారు. ప్రతీసారి ఎన్నికలు రాగానే కృష్ణ ఈ విధంగానే వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. కృష్ణమాదిగకు ఎన్నికల్లో పోటీచేయాలని ఉంటే మహాజన సోషలిస్టు పార్టీ తరఫున పోటీచేసి సత్తా చాటాలని సవాలు విసురుతున్నారు.