🅿️వాహనదారులకు ఊరట.. టోల్‌ ఛార్జీల పెంపు వాయిదా

వాహనదారులకు ఊరట లభించింది. వార్షిక షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 1 నుంచే జాతీయ రహదారులపై అమలు చేయాల్సిన పెంచిన టోల్‌ రేట్లను వాయిదా వేశారు. ఈ మేరకు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రి అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. లోక్‌ సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు పెంపును నిలుపుదల చేయాలని సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం.

ఎన్నికలు పూర్తయ్యే వరకు పాత ఛార్జీలే వసూలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఎన్‌హెచ్‌ఏఐని సూచించింది. ఏటా ఏప్రిల్ 1న టోల్‌ రుసుం పెరుగుతుంది. ఈవిషయం అందరికీ తెలిసిందే. పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుంది. దాంతో.. పెరిగిన చార్జీలను ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ పెంపుని వాయిదా వేయాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది.

ఇక ఇప్పటికే ఏప్రిల్‌ 1న పెంచిన టోల్‌ చార్జీలను కొంత మేర వాహనాల నుంచి వసూలు చేశారు. వాటిని కూడా వాహనదారులకు తిరిగి వెనక్కి ఇవ్వనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు వెల్లడించాయి. ఇక దేశంలో ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 26వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు పోలింగ్‌ కొనసాగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వస్తాయి. ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాల్లో పెంచిన టోల్‌ చార్జీలు అమల్లోకి వస్తాయా? లేదంటే ఎన్నికలు మొత్తం అన్ని చోట్లా పూర్తయిన తర్వాతే అమలు చేస్తారా తెలియాల్సి ఉంది. ఇక అప్పటి వరకు మాత్రం పాత టోల్ ఛార్జీలనే వసూలు చేయనున్నారు.